AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్‌ఆర్టీసీ కండక్టర్లపై దాడి.. అంబర్‌పేట యువతి అరెస్టు

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ డిపో-1కు చెందిన బస్సులో ఇటీవల ఇద్దరు కండక్టర్లపై దాడికి పాల్పడిన మహిళను అరెస్టు చేశారు. ఇద్దరు కండక్టర్లపై నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర్‌పేటకు చెందిన సయ్యద్‌ సమీనాను రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

ఆర్టీసీ కండక్టర్లపై దాడికి సంబంధించిన కేసు విచారణను త్వరతిగతిన చేపట్టి.. నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులకు ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించినా, దాడులకు పాల్పడినా యాజమాన్యం ఏమాత్రం సహించదని పునరుద్ఘాటించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. పోలీస్‌ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్‌ తెరిచేలా సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 45 వేల మంది టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని ప్రయాణికులకు సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నామని అన్నారు.

ఏం జరిగిందంటే..
ఇటీవల అంబర్‌పేటకు చెందిన సమీనా బేగం హయత్‌ నగర్‌ డిపో-1కు చెందిన బస్సులో ప్రయాణించింది. ఆ సమయంలో చిల్లర విషయంలో కండక్టర్‌తో సమీనా బేగం గొడవపడింది. ఇది మొదటి ట్రిప్పు అని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్‌ విన్నవించినా ఆమె ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడింది. అంతేకాకుండా అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించింది. ఒక‌ట్రెండు త‌న కాలితో కండక్టర్‌ను త‌న్నింది. తాను మ‌ర్డర్లు చేస్తానని.. చంపేస్తానంటూ కండ‌క్టర్‌ను బెదిరింపుల‌కు గురి చేసింది. బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. ఆమెను నిలువ‌రించేందుకు మ‌రో మ‌హిళా కండ‌క్టర్ ప్రయ‌త్నించిన‌ప్పటికీ, ఆమె ప‌ట్ల కూడా దురుసుగా ప్రవ‌ర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. కండక్టర్‌పై దాడికి దిగిన యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆమెను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ANN TOP 10