AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంపాయ్ సోరెన్

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాంచీలోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు బుధవారం అరెస్ట్ అయ్యారు. అదే సమయంలో చంపయ్ సోరెన్‌ను జేఎంఎం శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే తనకు ఎమ్మెల్యేల బలం ఉందని, కాబట్టి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని చంపాయ్ సోరెన్ గవర్నర్‌ను కోరారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తాలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంపాయ్ మాట్లాడుతూ.. హేమంత్‌ సోరెన్‌ గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ఆయన ప్రారంభించిన పనులను తాము వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులను సకాలంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలని ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. తమ కూటమి వారి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ అన్నారు.

ఇక త్వరలో అసెంబ్లీలో చంపాయ్ సోరెన్ బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్ శాసన సభలో జేఎంఎం – కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి 48 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. గురువారమే వీరు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శుక్రవారం రానున్నారు.

ANN TOP 10