AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అన్ని దారులూ ఇంద్రవెళ్ళికే..

తరలిన కాంగ్రెస్ శ్రేణులు
లోక్ సభ ఎన్నికలకు శంఖారావం పూరింపు

అమ్మన్యూస్ ప్రత్యేక ప్రతినిధి , హైదరాబాద్ : త్వరలో జరుగబోయే లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించనుంది. చారిత్రాత్మకమైన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఈ సభలో లోక్‌‌సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. అలాగే కేస్లాపూర్ నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించి, స్మృతి వనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా నేడు రూ.160కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభకు లక్ష మంది వస్తారని కాంగ్రెస్ అంచనా వేసింది. అనుకున్నట్లుగానే ఇంద్రవెళ్ళికి భారీ ఎత్తున ప్రజలు తరలి వెళ్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మరింత ఉరకలు వేస్తోంది. ఈ వేదిక ద్వారానే రాష్ట్రంలో త్వరలో అమలు చేయబోయే మరో రెండు పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశాలున్నాయి. గడచిన వారం రోజులుగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ కంది శ్రీనివాసరెడ్డి, ఇంద్రవెళ్ళి మీటింగ్ ఇంచార్జీ పటేల్ రమేష్ రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ANN TOP 10