AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌కు ఝార్కండ్ ఎమ్మెల్యేలు

భూ ఆక్రమణల కేసులో ఈడీ విచారణను ఎదుర్కుని ఝార్కండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేందుకు సిద్దమైంది. ఝార్కండ్‌లో బీజేపీ ఆపరేషన్ కమలం ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు జేఎంఎం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే అధికార కూటమికి చెందిన జెఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను రెండు చార్టెడ్ విమానాలను బుక్ చేసి హైదరాబాద్‌కు తరలించేందుకు నిర్ణయించింది.

81 మంది ఎమ్మెల్యేలున్న ఝార్కండ్ అసెంబ్లీలో తమకు 47 మంది ఎమ్మెల్యేల బలముందని జెఎంఎం కూటమి చెబుతోంది. అంతేకాకుండా కూటమి శాసనసభ పక్ష నేతగా చంపయీ సోరెన్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి సమాచారాన్ని కూడా పంపించారు. నిన్నటి దాకా సీఎంగా పని చేసిన హేమంత్ సోరెన్ అరెస్టవడంతో రాజకీయ సమీకరణలను తారుమారు చేయాలని సంకల్పించిన బీజేపీ నాయకత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సభ్యుల బలాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. దీంతో జెఎంఎం కూటమి అప్రమత్తమై తమ కూటమిలోని ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించాలని భావిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రంగంలోకి దిగడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరో పక్క హైదరాబాద్ కు తరలించనున్న ఎమ్మెల్యేల బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం అప్పగించినట్లు సమాచారం. గతంలో కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను ఆ రాష్ట్ర ప్రస్తుత డిప్యూటీ సీఎం శివకుమార్ తో కలిసి రేవంత్ రెడ్డి భగ్నం చేయడంతో ఆయన సమర్థతను గుర్తించిన అధష్టానం ప్రస్తుతం మరో టాస్క్ అప్పగించింది. ఈ టాస్క్ ను సవాల్ గా తీసుకున్న రేవంత్ ఎమ్మెల్యేల బసతో పాటు మిగతా ఏర్పాట్లు తదితర అంశాలన్నింటినీ దగ్గరుండి చూసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ANN TOP 10