86 మంది సిబ్బందికి స్థానచలనం
నగర సీపీ సంచలన నిర్ణయం..
హైదరాబాద్: నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఏఆర్ కు సీపీ అటాచ్ చేశారు. 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్‌ఐ లు మొదలు హోంగార్డ్ వరకు మొత్తం 84 మంది షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తుంటారు. సీఐలు, ఎస్‌ఐలు మినహా మిగతా సిబ్బంది కొన్నేళ్ల నుంచి ఒకేచోట పాతుకుపోయి ఉండటంతో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహంతో ఉన్నారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై స్టేషన్ లో సిబ్బందిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకం చేశారు.









