రాష్ట్రంలో పెండింగ్ చలాన్ల రాయితీ గడువు నేటితో ముగియనుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారిపై తెలంగాణ పోలీసులు జరిమానాలు విధించారు. ఈ బకాయిలు చాలా రోజులుగా పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చలాన్లు క్లియర్ చేసుకునే వారికి రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. మిగిలినవారు సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఇదే చివరి ఛాన్స్ అని.. గడువు పెంచే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ రాయితీల చెల్లింపులు ప్రక్రియ చెపట్టింది ప్రభుత్వం. ఈ రాయితీ అవకాశాన్ని జనవరి 10 వరకు మాత్రమే కల్పించారు. అయితే వాహనదారుల నుంచి మంచి స్పందన రావటంతో గడువును జనవరి 31వ తేది వరకు పొడిగించింది. ఇవాళ్టి వరకు రాయితీతో ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రాయితీ వర్తించదని పోలీస్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పెండింగ్ చలాన్ల రాయితీలో భాగంగా ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు ,తోపుడుబండ్లపై 90శాతం రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50శాతం రాయితీని కల్పించింది. ఇక చాలా మంది వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి చలాన్ల ద్వారా రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.









