నేడే కొమురవెల్లి మల్లన్న పట్నంవారం
జానపదుల జనజాతరకు ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం సంసిద్ధమైంది. జాతరలో మొదటి ఆదివారాన్ని పట్నంవారంగా పిలుస్తున్న క్రమంలో మల్లన్న దర్శనార్థం హైదరాబాద్‌కు చెందిన వేలాదిమంది భక్తులు ఇంటిల్లిపాది శనివారం సాయంత్రానికి మూటముల్లెతో కొమురవెల్లికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
భక్తులు కాళ్లు, చేతులు శుభ్రపరుచుకోకుండానే నేరుగా స్వామివారిని ధూళి దర్శనం చేసుకుని ఒడిబియ్యాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. కాగా ఆదివారం మల్లన్నకు బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు మల్లన్న ఆలయ గుట్టపై ఉన్న ఎల్లమ్మ దేవతకు బోనాలు నివేదించనున్నారు. సోమవారం తోటబావి ప్రాంగణంలో హైదరాబాద్ యాదవసంఘం ఆధ్వర్యంలో పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహించనున్నారు. స్నానాలకోసం తోటబావి, కోడెల స్తంభం, మల్లన్న చెరువు సమీపంలో బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ సిద్ధం చేశారు. భక్తులు బసచేసే పలు ప్రదేశాలకు సమీపంలో నల్లాలు నిర్మించగా, మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేశారు. భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదాన్ని సైతం తయారుచేసి సిద్ధం చేశారు.
చుక్కలనంటిన ప్రైవేటు గదుల అద్దె
ఆలయ పరిఽధిలోని గదులను దాతలకు కేటాయించగా, భక్తుల రద్దీ కారణంగా ప్రైవేటు గదుల యజమానులు మూడురోజులకు రూ.4-8వేల చొప్పున అడ్డగోలుగా వసూలు చేశారు. చిన్నపాటి ఖాళీస్థలంలో తడకలు అడ్డుపెట్టి రూ.2వేలు చొప్పున అద్దెకు ఇచ్చారు. ఆర్థిక స్థోమత లేనివారు ఆరుబయట ప్రదేశాల్లో గుడారాలు వేసుకోగా, మరికొంతమంది చెట్టు నీడన తలదాచుకున్నారు.









