ఉత్తర భారతంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది (Dense Fog). ఉదయం 8 గంటలు అవుతున్నా చీకటిగానే ఉంది. 50 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాతావరణ శాఖ ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పాటియాలా, లక్నో, ప్రయాగ్‌రాజ్‌లలో విజిబిలిటీ 25 మీటర్లుగా ఉంది. ఇక అమృత్ సర్‌లో ఏకంగా జీరోకు పడిపోయింది. విజిబిలిటీ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని పాలెంలో 125 మీటర్లు, సఫ్దార్‌జంగ్ అబ్జర్వేటరీలో 50 మీటర్లుగా ఉంది. మరోవైపు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పొగమంచు పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.
ఆలస్యంగా నడుస్తున్న 110 విమానాలు, 25 రైళ్లు..
ఈ పొగ మంచు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. పొగ మంచు దట్టంగా కమ్మేయడంతో పలు చోట్ల దృశ్యమానత జీరోకు పడిపోయింది. ఈ కారణంగా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం దాదాపు 110 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అటు రైళ్ల రాకపోకలపై కూడా పొగమంచు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాజధానికి రావాల్సిన సుమారు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఉత్తర రైల్వే వెల్లడించింది.
క్షీణించిన గాలి నాణ్యత..
ప్రస్తుతం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగా.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. చలికి తోడు రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత కూడా బాగా క్షీణించింది. సగటు గాలి నాణ్యత 381కి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. ఆనందర్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 441గా ఉంది. ఇక సెంట్రల్ ఢిల్లీలోని లోధి రోడ్డులో 327, అంతర్జాతీయ విమానాశ్రయంలో గాలి నాణ్యత 368గా ఉంది. ఘజియాబాద్, నోయిడాలో 336, 363గా ఉంది. వచ్చే వారంలో గాలి నాణ్యత మరింత దిగువకు పడిపోయే అవకాశం ఉందని అంచనా.









