మరికొన్ని గంటల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Polling)మొదలవుతుంది.రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని 13 సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం పోలింగ్ ఒక గంట ముందుగా అంటే సాయంత్రం 4గంటలకే ముగుస్తుంది.119 నియోజకవర్గాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషుల ఓట్లు 1,62,98,418 ఉన్నాయి. మహిళా ఓటర్లు – 1,63,01,705 మంది ఉన్నారు. మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు తీసుకోవాల్సిన అన్నీ చర్యలు తీసుకున్నారు అధికారులు. అత్యధికంగా ఎల్ బీ నగర్ నియోజకవర్గంలో 48 మంది పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడలో ఏడుగురు చొప్పున బరిలో నిలిచారు.
ఆ 13 నియోజకవర్గాల్లో గంట ముందే క్లోజ్..
119 నియోజకవర్గాలకు గాను కేవలం 13 నియోజకవర్గాలైన సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు,కొత్తగూడెం, అశ్వారావు పేట, భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషుల ఓట్లు 1,62,98,418 మహిళల ఓట్లు 1,63,01,705 ఉన్నాయి.ఈసారి పోలింగ్ విధులను నిర్వహించడానికి 1,85,000 మంది పోలింగ్ సిబ్బంది, 22వేల మైక్రో అబ్జర్వర్లను ఉపయోగిస్తున్నారు.ఎన్నికల బందోబస్తు కోసం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలు, 50వేల మంది పోలీసు బలగాలు రంగంలోకి దింపారు.
గతంలో ఎన్నికల్లో అమలు చేసినట్లుగానే ఈసారి కూడా 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్స్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు.అదే విధంగా ఈసారి ఎన్నికల్లో కొత్తగా 9.9 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.5 లక్షల మంది ఓటు వేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం నుంచే 144 సెక్షన్ అమలవుతోంది.ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమికూడవద్దని పోలీసులు హెచ్చరించారు.









