అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. 28వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఎన్నికల సామాగ్రి చేరుతుందనీ, అక్కడి నుంచి 29న పోలింగ్ కేంద్రాలకు ఈవీఎమ్‌లు, ఇతర ఎన్నికల సామాగ్రిని తరలిస్తామన్నారు. ఈవీఎమ్‌ల తనిఖీలు ఈనెల 24, 25 తేదీల్లో పూర్తయ్యాయని విలేకరుల సమావేశంలో వివరించారు. ఎన్నికల నిర్వహణకు రెండు లక్షల 8 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారనీ, 12వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామనీ, శాంతియుత నిర్వహణ కోసం ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలనూ మోహరించినట్టు తెలిపారు. ఎన్నికల తనిఖీల సందర్భంగా ఇప్పటి వరకు రూ.709 కోట్లకు పైగా సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు.
119 నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో పురుషులు 2,068 మంది, మహిళలు 221 మంది, ఒక్క ట్రాన్స్‌జెండర్ ఉన్నారని వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 1,68,612 మంది సిబ్బందికి ఫెలిసిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశామన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1,00,135 పోస్టల్ బ్యాలెట్లు ఉండగా, ఈసారి వాటి సంఖ్య మరింత పెరిగిందన్నారు. 49 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామనీ, 31 జిల్లాల్లో ఒక్కో కౌంటింగ్ సెంటర్, రంగారెడ్డి జిల్లాలో నాలుగు, హైదరాబాద్‌లో 14 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, మూడువేల మంది ఎక్సైజ్ సహా ఇతర శాఖల సిబ్బంది, టీఎస్‌ఎస్పీ నుంచి 50 కంపెనీలు, 375 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ ఎన్నికల బందోబస్తులో పాల్గొంటాయని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి 23,500 మంది హౌంగార్డుల్ని కూడా రప్పిస్తున్నామనీ, 1,866 స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 1,020 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. మంత్రి కే తారకరామారావుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు ఇంకా సమాధానం తమకు అందలేదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 21,686 వీల్‌చైర్లు ఏర్పాటు చేశామనీ, బ్రెయిలీలో 76,532 ఓటర్లు స్లిప్పులు ముద్రించామన్నారు. తమకు వస్తున్న ఫిర్యాదులపై సాధ్యమైనంత వేగంగా స్పందిస్తున్నామని చెప్పారు. సమావేశంలో అడిషనల్ సీఈఓ లోకేష్‌కుమార్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.









