AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాస్‌గంజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు..

ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. కోచ్‌ కింద భాగంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అందులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఒక వ్యక్తి ధైర్యంతో ఫైర్‌ కంట్రోల్‌ సిలిండర్‌ ద్వారా మంటలు ఆర్పివేశాడు. ప్రయాణికులు వెంటనే ఆ కోచ్‌ నుంచి కిందకు దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం కాన్పూర్ నుంచి ఫరూఖాబాద్ వెళ్తున్న కాస్‌గంజ్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌ వద్ద మంటలు చెలరేగాయి. బిల్హౌర్ స్టేషన్ సమీపంలోని శుభన్‌పూర్ గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. గమనించిన ఒక వ్యక్తి ఫైర్‌ కంట్రోల్‌ సిలిండర్‌ ద్వారా ఆ మంటలను ఆర్పివేశాడు. ఇంతలో రైలు ఆగడంతో ఆ కోచ్‌లోని ప్రయాణికులంతా భయంతో కిందకు దిగారు.

కాగా, ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు, ఫైర్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరికీ ఏ ప్రమాదం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్ వెనుక ఉన్న నాల్గవ కంపార్ట్‌మెంట్‌ వద్ద ప్రెజర్‌ లీక్‌ వల్ల బ్రేక్‌ ఫెయిల్‌కు దారి తీసిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో రాపిడి వల్ల పొగలు వెలువడ్డాయని చెప్పారు. ఈ సంఘటనలో రైలు, లేదా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని తెలిపారు. ఆ తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలి వెళ్లిందని చెప్పారు. ఫరూఖాబాద్ చేరుకున్న తర్వాత ఆ రైలును క్షుణ్ణంగా పరిశీలిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.

ANN TOP 10