రైతు తన సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసిననాడే బంగారు తెలంగాణ సాకారమైనట్లని, తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉండేందుకే పోరాడుతున్నానని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా పరిగిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అభ్యర్థి వెనుక పార్టీ గురించి ఆలోచించాలని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి పది మందితో చర్చపెట్టి తేల్చి ఓటు వేయాలని సూచించారు. ఇరవైనాలుగు కరెంట్ కావాలా.. కాంగ్రెసోళ్ళు కావాలా అని ప్రజలే తెల్చుకోవాలని సూచించారు.
బీఆర్‌ఎస్ తెలంగాణ సాధించడానికి, మన హక్కులు సాధించడానికి పుట్టిన పార్టీయని పేర్కొన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణలోనేనని చెప్పారు. కాంగ్రెస్ వస్తే నష్టపోయేది ప్రజలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళారీ రాజ్యం వస్తుందని, పైరవీకారులు చేలరేగి పేదలకు ఇబ్బందులు పెడతారని చెప్పారు. వచ్చే ఏడాదిలో మిషన్ మోడ్ ద్వారా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. పరిగికి పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలు, కంకల్, దాదాపూర్ గ్రామాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పరిగి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మహేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పరిగి ఎమ్మెల్యే అభ్యర్థి మహే్‌షరెడ్డి మాట్లాడుతూ మీ బిడ్డగా మరోసారి ఆశీర్వదించి గెలిపించండి.. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. సీఎం కేసీఆర్, నాన్న హరీశ్వర్‌రెడ్డి, పరిగి ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎ్‌సను ఆదరించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అంతకు ముందుకు తాండూరు విలియమూన్ మైదానంలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.
మహేందర్‌రెడ్డి పెద్ద మనస్సుతో టికెట్ త్యాగం చేస్తే.. నిజాయితీకి నిలబడిన రోహిత్‌రెడ్డికి టికెట్ దక్కిందని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ చేసిన కుట్రను రోహిత్‌రెడ్డి భగ్నం చేసి వారిని జైలుకు పంపించాడని కొనియడారు. తాండూరు అభివృద్ధ్ది చెందాలంటే, రాష్ట్రంలో రైతుబంధు, 24 గంటల విద్యుత్ కావాలంటే తాండూరులో రోహిత్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. రోహిత్‌రెడ్డి కోరిన హామీలన్నీ హైదరాబాద్‌లోనే అమలు నిర్ణయం తీసుకునేదని, వందకు వందశాతం వాటిని అమలు చేస్తామన్నారు. కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధ్దం మరొకరిని చేయమంటే కుదరని, రోహిత్‌రెడ్డిని గెలిపిస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు. తాండూరుకు భారీ నిధులు కేటాయించి అఽభివృద్ధి చేశామన్నారు. రోహిత్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.









