కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పేరు గొప్ప ఊరు దిబ్బ లెక్కుంది దొరగారి కమీషన్ల కాళేశ్వరం దుస్థితి. నా రక్తం, నా చెమట అని కల్లబొల్లి మాటలు చెప్పి.. కట్టింది ప్రాజెక్ట్ కాదు పేక మేడ అని బయట పడ్డది. తెలంగాణ ప్రజల సంపద 1.27 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్లు? ఏం ఉద్ధరించినట్లు? మేడిగడ్డ బ్యారేజ్ పై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు. మీ మెగా అవినీతికి,మెగా పనితనానికి నిదర్శనం. వందల ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండాల్సిన బ్యారేజ్‌లు.. కట్టిన నాలుగేళ్లకే ముక్కలైన ఘనత ప్రపంచలోనే మన మెగా కేసీఆర్ కే దక్కింది’’ అంటూ వైఎస్సార్టీపీ చీఫ్ ఎద్దేవా చేశారు.
80 వేల పుస్తకాలు చదివిన దొర మెగా ఇంజినీరింగ్ పనితనం ప్రపంచానికి తెలిసిందన్నారు. లోపాలు కళ్లముందు కొట్టొచ్చినట్లు కనపడుతుంటే.. దొర లక్ష కోట్ల దోపిడీ జనాలకు అర్థమైతుంటే.. బీటలు బారడం కామనట… నెర్రెలు రావడం సహజమట అంటూ మండిపడ్డారు. ఇంతకాలం జనాలను మభ్యపెట్టింది చాలు కేసీఆర్ అని అన్నారు. తమరి దోపిడీ పాపం పండిందని.. అవినీతికి కాలం చెల్లిందన్నారు. తిన్నదంతా కక్కించే దాకా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వెంటనే ఒక దర్యాప్తు కమీషన్‌ను వేయాలని.. జరిగిన అవినీతిపై విచారణ తక్షణం చేపట్టాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.









