తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం లోని కోనాయిపల్లికి వచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత.. నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ ఇదే సెంటిమెంట్ పాటించారు. మంత్రి హరీశ్‌రావు కూడా ఈ పూజలో పాల్గొన్నారు.
1983లో టీడీపీ నుంచి తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ ఓడిపోయారు. ఐతే.. రెండేళ్లకే 1985లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజ చేసి, నామినేషన్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలవడంతో అది సెంటిమెంట్‌గా మారింది. అప్పటి నుంచి ప్రతిసారీ ఎన్నికలప్పుడు ఇలాగే చేస్తున్నారు. 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో ఇలాగే చేశారు. ప్రతిసారీ గెలిచారు.
రెండు నామినేషన్లు:
వ్యూహం ఏదైతేనేం.. ఈసారి కేసీఆర్… గజ్వేల్, కామారెడ్డి… రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అందువల్ల ఈసారి రెండు నామినేషన్లు ఇస్తారు. ఇందుకోసం ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.. రెండు నామినేషన్ల పత్రాలను స్వామి పాదాల దగ్గర ఉంచి, పూజ చేశారు. ఆ తర్వాత నామినేషన్లపై సంతకాలు చేశారు. కానీ వాటిని ఇవాళ ఇవ్వరు. ఈనెల 9న దాఖలు చేస్తారు. మొదటి నామినేషన్ గజ్వేల్‌లో వేసి, మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ వేస్తారు. అదే రోజు సాయంత్రం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు.









