AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్థిక మాంద్యం వైపు ఏపీ అడుగులు అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు..

కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు‌ వైసీపీ అధినేత జగన్. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు సర్కార్ విస్మరించిందని ఆరోపించారు. వడ్డీ రాయితీ పథకాన్ని నిలిపి వేసి మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తోందంటూ దుయ్యబట్టారు. పన్ను ఆదాయ వృద్ధి పడిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఆర్థిక మాంద్యం వైపు ఏపీ అడుగులు-జగన్

 

చంద్రబాబు ప్రభుత్వం మోసంపై ఎక్స్‌ వేదికగా రియాక్ట్ అయ్యారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందననారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయలేదని, దీనివల్ల ఆర్థిక సమస్యలు వస్తున్నాయని రాసుకొచ్చారు.

 

ఆయా గ్రూపులకు రుణాలు అందితే మహిళల్లో ఆర్థిక స్వావలంభన చేకూరుతుందన్నారు. రుణాల పెరుగుదల ఆగిపోవటంతో పెట్టుబడులు, ఆదాయాలు తగ్గాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25 ఏడాదిలో వడ్డీ రాయితీ కింద ఒక్క రూపాయి విడుదల చేయలేదని ఆరోపించారు.

 

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విసుర్లు, డ్వాక్రా సంఘాల మాటేంటని ప్రశ్న

 

2025, 2026-27 బడ్జెట్‌లోనూ రూ.100 కోట్ల కేటాయించినప్పటికీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఒక్క పైసా విడుదల చేయలేదన్నారు. వడ్డీ రాయితీ అమలు చేయకపోవడంతో రెండేళ్లలో డ్వాక్రా మహిళలకు దాదాపు రూ.6 వేల కోట్ల మేర నష్టం జరిగిందన్నారు. అదే సమయంలో ఆనాటి వైసీపీ ప్రభుత్వం గురించి ప్రస్తావించారు.

 

తాము తీసుకున్న చర్యల వల్ల 2019-24 మధ్య స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాల్లో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. ఆసరా, చేయూత వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడంతో రుణాల వృద్ధిలో క్షీణత ఏర్పడిందన్నారు.

 

2023-24 ఆర్థిక ఏడాదిలో రూ. 49,696 కోట్లుగా ఉన్న డ్వాక్రా రుణాలు, 2024-25లో రూ. 41,623 కోట్లకు, 2025-26లో రూ. 41,105 కోట్లకు పడిపోయిందన్నారు. 2025-26లో రాష్ట్ర పన్ను ఆదాయ వృద్ధి -3.22 శాతంగా నమోదు అయ్యిందని గుర్తు చేశారు. కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డీ రాయితీ పథకం వర్తించే రుణ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిందని వివరించారు.

 

ఏపీలో పన్ను ఆదాయ వృద్ధి పడిపోయిందని, ఫలితంగా ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ బయటపెట్టిన లెక్కల వెనుక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల విజయసాయిరెడ్డి ఏపీ ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై జగన్ విరుచుకుపడ్డారని అంటున్నారు కొందరు నేతలు.

ANN TOP 10