AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశంలో మరోసారి జికా వైరస్ గుర్తింపు.. అప్రమత్తమైన ప్రభుత్వం

కర్ణాటక రాష్ట్రంలో జికా వైరస్‌ను మరోసారి గుర్తించారు. చిక్కబళ్ళాపుర జిల్లాలో జికా వైరస్‌ను గుర్తించినట్లు కర్ణాటక వైద్య అధికారులు వెల్లడించారు. అయితే ఈ జికా వైరస్‌ను మనుషుల్లో కాకుండా దోమలో గుర్తించడం కొంత ఉపశమనం కలిగింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన వైద్య అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు, టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మనుషులు ఎవరిలో ఈ జికా వైరస్ లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు.

చిక్కబళ్లాపుర జిల్లాలోని శిడ్లఘట్ట తాలూకా తలకాయలబెట్ట గ్రామంలో ఉన్న దోమలను ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించగా.. వాటిలో జికా వైరస్‌ ఉన్నట్లు వైద్య అధికారులు గుర్తించారు. అయితే ఆ గ్రామ ప్రజల్లో మాత్రం ఎలాంటి జికా వైరస్ రోగ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు. ఆ తలకాయలబెట్ట గ్రామంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఐదు కిలోమీటర్‌ల మేర ఉన్న ప్రజలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు జిల్లా ప్రజలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పలు మార్గదర్శకాలు సూచించింది.

ఈ విషయంపై కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావ్‌ మీడియాతో మాట్లాడారు. చిక్కబళ్ళాపుర జిల్లాలో దోమలలో జీకా వైరస్‏ను గుర్తించామని కానీ ప్రజలకు ఎవరికీ ఎలాంటి వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. కేరళలో నిఫాతో పాటు జీకా వైరస్‏లు వ్యాప్తి చెందినపుడే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అందర్నీ అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా జీకా వైరస్‌ పాజిటివ్‌ కాలేదని చిక్కబళ్ళాపుర జిల్లా వ్యాప్తంగా అప్రమత్తం చేశామని వెల్లడించారు. ఆస్పత్రిలో ఉండేవారికి కూడా పరీక్షలు చేశామన్నారు. జీకా వైరస్‌ తీవ్రమైన ప్రభావం చూపేది కాదని చెప్పారు. స్థానిక సంస్థలను అప్రమత్తం చేసి గ్రామాల్లో, మండలాల్లో పారిశుద్ద్య పనులు చేపడుతామని స్పష్టం చేశారు.

ANN TOP 10