AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేపాల్‌లో భారీ భూకంపం.. 128 మంది మృతి, 150 మందికిపైగా గాయాలు

నేపాల్ భూకంపంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి 6.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం నేపాల్‌ను వణికించింది. ఈ భూకంపం ధాటికి భారత్‌లోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో మొదట ప్రమాద తీవ్రత అంత బయటపడలేదు. సహాయక చర్యలు చేపడుతుండగా.. మృతులు, గాయపడిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం ఘటనలో మృతుల సంఖ్య 128 కి ఎగబాకింది. మరోవైపు.. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో నేపాల్ విపత్తు నిర్వహణ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు నేలమట్టం కావడంతో వాటి కింద చిక్కుకున్న వారిని రక్షించడం, చనిపోయిన వారి మృత దేహాలను వెలికితీయడం చేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ భారీ భూకంపం సంభవించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం పేర్కొంది. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం గుర్తించింది. భూకంప తీవ్రతకు పలు జిల్లాలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రుకమ్‌ జిల్లాలో 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధానమంత్రి పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ సంతాపం ప్రకటించారు.

నేపాల్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్రతకు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్‌లలోని పలు ప్రాంతంలో భూమి కంపించడంతో అర్ధరాత్రి జనం భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ANN TOP 10