కర్ణాటక లో హామీల అమలుల్లో సందేహాలుంటే వచ్చి చూసుకో.. లగ్జరీ బస్సులో తీసుకెళ్లి చూపిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఆదివారం కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర సంగారెడ్డిలోని గంజ్ మైదానానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రేవంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జునఖర్గే మీడియాతో మాట్లాడుతూ…‘‘సోనియాగాంధీ వల్లే తెలంగాణ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సమాధి అవుతున్నా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ వెనక్కి తగ్గలేదు.
కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆన్నీ హామీలు చేస్తున్నాం. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులు మభ్యపెడుతున్నారు. బీఆర్ఎస్..బీజేపీ రెండూ ఒక్కటే.. బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్‌గా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్లుగానే సీఎం కేసీఆర్ కూడా గతంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు సైతం పక్కాగా తెలంగాణలో అమలవుతాయి. ఇవి ఓట్ల కోసం ఇస్తున్న హామీలు కావని, పేదల బతుకుల్లో బాగు కోసం ఇస్తున్న గ్యారంటీలుగా గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియాగాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్, అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయి ఇప్పుడు సోనియా గాంధీని విమర్శిస్తున్నారు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.









