AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గజ్వేల్ బరిలో ఈటల రాజేందర్!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ను ఓడించటమే లక్ష్యంగా తాను కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించిన ఈటల రాజేందర్ కు ఆ సువర్ణావకాశం వచ్చినట్టుంది. గజ్వేల్ బరిలో తాను ఉంటే కేసీఆర్ కు టెన్షన్ పక్కా అని చెప్తున్న ఈటల ఆలోచనలకు తగ్గట్టు అధిష్టానం ఆయనను హుజూరాబాద్ నుండి మాత్రమే కాకుండా గజ్వేల్ నుండి కూడా ఎన్నికల బరిలోకి దింపనుంది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి తాను బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. అధిష్టానం అవకాశం ఇవ్వాలన్నారు. తాను ఈ ఎన్నికల్లో కేసీఆర్ ని తాను ఓడించడం ఖాయమని పేర్కొన్న ఈటల రాజేందర్ గజ్వేల్ నియోజకవర్గంలోని పరిస్థితులను బాగానే అధ్యయనం చేశారు.

రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని కలలు కంటున్న సీఎం కేసీఆర్, ఈసారి ఎన్నికలలో గజ్వేల్ నుంచి, కామారెడ్డి నుంచి రెండుచోట్ల ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపధ్యంలో, ఈటల కూడా హుజూరాబాద్ నుండి, గజ్వేల్ నుండి పోటీ చెయ్యనున్నారని అందుకు అధిష్టానం ఓకే చెప్పిందని సమాచారం. ఈటల రాజేందర్ కు హుజూరాబాద్ లో విజయ సాధించటం నల్లేరు మీద నడకే. అయితే ఈ సమయంలోనే ఈటల సీఎం కేసీఆర్ పై పోటీకి దిగి సీఎం స్థాయి అభ్యర్థిని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బి ఆర్ ఎస్ పార్టీలో చాలామంది అసంతృప్త నాయకులు సీఎం కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి కోసం పని చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇక వారి సహాయంతో ఈటల రాజేందర్ గజ్వేల్ నియోజకవర్గంలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. గెలిస్తే కేసీఆర్ ను ఓడించిన పేరు దక్కుతుంది. అలా కాకుండా ఓటమి పాలైనా తనకు జరిగే నష్టం ఏమీ లేదు. హుజూరాబాద్ లో కూడా పోటీ చేస్తారు కాబట్టి అక్కడ కచ్చితంగా గెలిచి తీరుతానని భావిస్తున్నారు.

ANN TOP 10