వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్ మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను దోచుకోవడంలో పోటీపడ్డాయేగానీ ప్రజల సంక్షేమం పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు లక్షల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్ లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలంతా ప్రజాశాంతి వైపే మొగ్గుచూపుతున్నారని, సర్వేలు సైతం ఇదే విషయం చెపుతున్నాయన్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తగిన ప్రాధాన్యతను ఇవ్వడంలేదని ప్రజాశాంతి మాత్రమే తగిన న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనాయకులు తనతో టచ్‌లో ఉన్నారని, తెలంగాణ ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలను దోచుకునే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను కాకుండా తెలంగాణను అభివృద్ధి చేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని పాల్ పిలుపునిచ్చారు.









