సింగరేణిలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ ఎన్నికలను ఇప్పుడే చేపట్టలేమని పేర్కొంటూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలు జరిపేందుకు సంబంధించి సెంట్రల్ చీఫ్ లేబర్ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సింగరేణితో పాటు ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తున్న విషయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్లో ఉన్న వర్గపోరుతో పార్టీకి నష్టం తప్పదని, అలాగే సింగరేణి ఎన్నికలు నిర్వహించినా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చనందున కార్మికుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. 2017 అక్టోబరులో జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ గెలిచినప్పటికీ 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌లో కార్మికులు కాంగ్రె్‌సకు జైకొట్టారు. సింగరేణి ఏరియాలో 13 నియోజకవర్గాలు ఉంటే కేవలం మూడు స్థానాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది.
గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని రెండేళ్లకు పైగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నా వివిధ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తోంది. అక్టోబరులో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని సింగరేణి సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగరేణి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రభుత్వానికి లేఖలు రాశారని తెలిపారు. గడువు పెంచాలని కోరారు.