బీజేపీ అధికారంలోకి వస్తే 55 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేస్తామని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో బీజేపీ బూత్‌లెవల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించిన ఈటెల రాజేందర్, గరికపాటి మోహనరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయటంలో విఫలం అయ్యారు. ప్రభుత్వ భూములు అమ్మి ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీలో ఎన్నికైన ఎమ్మెల్యేలను పావులా వాడుకుంటున్నారన్నారు. గిరిజన ఎమ్మెల్యేగా ఉన్న రాముల నాయక్ పదవి దిగిపోక ముందే తన అధికారాలకు కత్తెర వేశారన్నారు. ‘ సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌ను పక్కన పెట్టి మదన్ లాల్‌కు వైరా టికెట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికార దాహంతో పనిచేస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను మోసం చేశారు.
కేంద్రంలో మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతాం’’ అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.









