బీఆర్ఎస్ పార్టీలోకి వస్తేనే బీసీ బంధు ఇస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. జీవో నెంబర్ 5 ద్వారా లక్ష రూపాయాలు బీసీ బంధు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీసీ బంధుకు తూట్లు పొడిచే విధంగా దుర్మార్గమైన ప్రక్రియను బీఅర్ఎస్ నేతలు అవలంబిస్తున్నారని విమర్శించారు.
అనేక బీసీ కులాలకు బీసీ బంధు అందడం లేదన్నారు. చాటలో తౌడు పోసి తన్నుకు చావమన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ తీరు ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి వస్తేనే బీసీ బంధు ఇస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో బీసీ బంధు కోసం 26 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దుబ్బాకలో బీసీ బంధు లెక్కలు చెప్పమంటే జిల్లా కలెక్టర్ తో సహా అధికారులంతా ఫోన్ లు స్విచ్చాఫ్ చేసుకున్నారని పేర్కొన్నారు.
లిస్ట్ ఇవ్వమన్నా ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలకు నచ్చిన వారికి మాత్రమే బీసీ బంధు ఇస్తున్నారని ఆరోపించారు. న్యాయ బద్దంగా నియోజక అభివృద్ధికి ఏటా ఇచ్చే రూ.ఐదు లక్షలు ఇవ్వడం లేదన్నారు. బీసీ బంధు బీఆర్ఎస్ నేతల ఇండ్ల నుంచి ఇవ్వడం లేదని అది ప్రజల సొమ్ము అని తెలిపారు. ఒకే ఇంట్లో ఇద్దరికి బీసీ బంధు ఇస్తున్నారు.. కానీ అర్హులైన నిరు పేదలకు మాత్రం అందడం లేదన్నారు.









