భారత్ అధ్యక్షతన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు కోసం సుందరీకరణ పనుల్లో భాగంగా ఢిల్లీ లోని మురికివాడలను కూల్చివేసి, అక్కడి ప్రజలను తరలించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ నేతల ముందు వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ క్రమంలోనే కోతులు, ఇతర జంతువులు వేదిక ప్రాంగణం వద్దకు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక, సుందరీకరణ కోసం మురికివాడల్లోని ప్రజలను తొలగించి, అవి కనబడకుండా గ్రీన్ షీట్లతో కవర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన కొన్ని దఅశ్యాలు కాంగ్రెస్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి కాస్తా వైరల్ అయ్యాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ”మన పేద ప్రజలను, జంతువులను కేంద్ర ప్రభుత్వం దాచిపెడుతోంది. జీ20 సదస్సు కోసం మన దేశానికి విచ్చేసిన అతిథుల నుంచి వాస్తవాలను దాచిపెట్టాల్సిన అవసరం లేదు” అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చారు.









