హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం(ఆగస్టు 27) రాత్రి వర్షం దంచికొట్టింది. పాతబస్తీ, బహదూర్ పుర, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, బండ్లగూడ, బర్కాస్, బీఎన్ రెడ్డి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్ పేట్, మణికొండ, గోల్కొండ, టోలీచౌకీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ లోనూ వాన కురిసింది. వర్షం దంచికొట్టడంతో రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
కాగా, కొన్ని రోజులుగా సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తీవ్రమైన ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. వాతావరణం చల్లబడింది. దాంతో ఉక్కపోత నుంచి ప్రజలు కాస్త రిలీఫ్ పొందారు.









