తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నిరోజులు బీఆర్ఎస్‌తో జట్టుగా ఉన్న కామ్రేడ్లను గులాబీ బాస్ పక్కన పెట్టారు. దీంతో.. బాగా హర్ట్ అయిన లెఫ్ట్ పార్టీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌తో దోస్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. సిద్ధం కావటమేంటీ.. పలానా సీట్లు కావాలంటూ మంతనాలు కూడా జరిగేవరకు వచ్చింది. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్ కూడా.. అధికారంలోకి వచ్చేందుకు ఏ ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే.. బీఆర్‌ఎస్‌తో కటీఫ్ అయిన కామ్రేడ్లతో దోస్తీ చేసి.. వారి ఓట్లు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే వామపక్ష నేతలతో ఏఐసీసీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే సంప్రదింపులు మొదలుపెట్టారు.
ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబిశివరావుకు థాక్రే ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై కూనంనేని క్లారిటీ ఇచ్చారు. సీపీఐ పోటీ చేయాలని చూస్తున్న నియోజకవర్గాల గురించి థాక్రే దృష్టికి తీసుకెళ్లారు. బెల్లంపల్లి, హుస్నాబాద్, కొత్తగూడెం, మునుగోడు స్థానాల్లో తమకు బలం ఉందని.. ఆ నాలుగు స్థానాలు తమకు కేటాయిస్తే.. పొత్తుకు సిద్ధమని తమ డిమాండ్ తెలిపారు. అయితే.. అందులో మునుగోడు, హుస్నాబాద్ స్థానాలు ఇచ్చేందుకు సుముఖత చూపించగా… కనీసం మూడు స్థానాలైనా కేటాయించాలని కూనంనేని స్పష్టం చేశారు. దీంతో.. కాంగ్రెస్‌తో కామ్రేడ్ల దోస్తీ దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది.









