AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

17 నెలల కొడుకును బావిలో తోసిన తండ్రి, ఆ తర్వాత..

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 17 నెలల కుమారుడిని బావిలో తోసేసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. చిన్నారి నీటిలో మునిగి చనిపోగా.. తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డికి భార్య మానస, కొడుకు దేవాన్ష్‌ (17 నెలలు) ఉన్నారు. గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా తిరుపతిరెడ్డికి సోదరుడు రత్నాకర్‌రెడ్డికి మధ్య భూమి విషయమై వివాదం నడుస్తోంది.

భూ సమస్య పరిష్కారం కాకపోగా.. తిరుపతిరెడ్డిని చంపేస్తామని రత్నాకర్‌రెడ్డి బంధువులు పలుమార్లు బెదిరించారు. ఈ బెదిరింపులతో తిరుపతిరెడ్డి దాదాపు ఏడాదిగా కుటుంబంతో కలిసి సుల్తానాబాద్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం (ఆగస్టు 25) వరలక్ష్మీ పూజ కోసం భార్యా కొడుకుతో కలిసి స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి సుల్తానాబాద్ వెళ్లాడు. శనివారం మరోసారి కొడుకు దేవాన్ష్‌ను తీసుకొని స్వగ్రామానికి బయల్దేరాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. నేరుగా పొలం వద్దకు వెళ్లి చిన్నారి దేవాన్ష్‌ను బావిలో తోసేశాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రాములపల్లికి వెళ్లిన భర్త, కొడుకు మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో మానస తన మామ (తిరుపతి రెడ్డి తండ్రి) సంజీవరెడ్డికి ఫోన్‌ అగిడింది. అయితే.. తిరుపతి రెడ్డి ఇంటికి రాలేదని సంజీవ రెడ్డి చెప్పాడు. అనంతరం పొలం వద్దకు వెళ్లి చూడగా.. బావి ఒడ్డుపై తిరుపతిరెడ్డి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. ఆందోళనకు గురైన సంజీవరెడ్డి.. మనవడి కోసం గాలిస్తూ అనుమానంతో బావిలో చూడగా నీళ్లపై చెప్పులు తేలి ఉండటాన్ని గమనించాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. బావిలోని నీటిని తోడి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతిరెడ్డి భార్య మానస ఫిర్యాదు మేరకు రత్నాకర్‌రెడ్డి, అతడి మామ సత్తిరెడ్డి, బావమరిది లక్ష్మణ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొనగా.. భూమి తగాదాలో అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనపెట్టుకోవటం పట్ల గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10