తెలంగాణలో మాస్ లీడర్ ఎవరంటే.. అరక్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు హరీశ్ రావు. ఆయనకు జనాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుసగా ఆరుసార్లు ఒకే ప్లేస్ నుంచి ఎమ్మెల్యేగా అదీ లక్షకు పైగా మెజార్టీతో గెలిచిన ఘనత కేవలం హరీశ్ రావుకే దక్కింది. ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలకు సాధారణ ప్రజానీకమే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా ఆకర్షితులవుతుంటారు. ఆయన ఫ్యాన్స్ లిస్ట్‌లో సొంత పార్టీ నేతలే కాదు.. విపక్ష నాయకులు కూడా ఉంటారండోయ్. దానికి నిదర్శనమే.. రంగారెడ్డి జిల్లాలో వెలిసిన ఫ్లెక్సీలు. గురువారం రోజున ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో.. మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావుకు ఆహ్వానం తెలుపుతూ.. కాంగ్రెస్ నేతలు కూడా దారి పొడువునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
సాధారణంగా అయితే.. ఏ పార్టీ నేత పర్యటిస్తే.. వారికి స్వాగతం పలుకుతూ ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులే ఫ్లెక్సీలు పెడుతుంటారు. కానీ.. మంత్రి హరీశ్ రావుకు విపక్ష పార్టీకి చెందిన నేతలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం.. ఇప్పుడు కొత్త ఒరవడికి తెరతీసినట్టయింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకర్ ప్రారంభంతో పాటు.. మరికొన్ని అభివృద్ధి పనులను హరీశ్ రావు ప్రారంభించారు.
కాగా.. ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో మంత్రి హరీష్ రావు ఫొటో ఉండటమేంటీ అని అటు స్థానికులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం.. అదీ హరీశ్ రావు ఫాలోయింగ్ అంటే..అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మాస్ లీడరా మజాకా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.









