ఖమ్మం: కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే అని.. రెండు పార్టీలు కలసేది ఖాయమని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని.. ఈ తెలంగాణ పట్టిన పీడ విరగడకావాలని యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటోందన్నారు. రైతు రుణమాఫీ ఎన్నికల ముందు కేసీఆర్‌కు జ్ఞాపకం వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అన్నివర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నారు. డబుల్ బెడ్ రూంల పేరుతో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో పేదలకు ఇండ్లు రావాలంటే కేసీఆర్ పాలన పోవాలన్నారు. వెన్ను పోట్లు మోసాలు అవినీతి అక్రమాలకు కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం అంటూ ఆయన విరుచుకుపడ్డారు.









