ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో కృష్ణారెడ్డి (46) అనే వ్యక్తి షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడు. గమనించిన స్నేహితులు కృష్ణారెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెంటనే పరిక్షించిన వైద్యులు.. కృష్ణారెడ్డి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. దీంతో.. అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా షటిల్ ఆడిన వ్యక్తి.. తమ కళ్ల ముందే.. క్షణాల్లో విగతజీవిగా మారటాన్ని కృష్ణారెడ్డి స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇలాంటి ఘటనాలు తరచూ జరుగుతుండటం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. జిమ్ నుంచి అప్పుడే వచ్చిన వ్యక్తి.. ఉన్నట్టుండి కుప్పకూలిపోవటం.. ఇకొందరైతే జిమ్‌లోనే ప్రాణాలు విడవటం.. మరికొందరు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూనే కూలబడిపోవటం.. మరికొందరు ఇలా షటిల్ ఆడుతూ ప్రాణాలు కోల్పోవటం.. లాంటి ఘటలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఇటీవలే.. ఓ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని ఫ్రెషర్స్ పార్టీలో డ్యాన్స్ చేస్తూనే.. స్టేజి మీద కుప్పకూలి ప్రాణాలు వదిలింది. సీపీఆర్ చేసినా ఆ అమ్మాయి ప్రాణాలు నిలవలేదు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా గంగాధరలో జరిగింది.