AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సాగర్‌లో అడుగంటిన జలాలు.. బీడు భూములుగా మారిన ఆయకట్టు..

రాష్ట్రంలో గోదావరి గలగల పాడుతుంటే కృష్ణమ్మ మాత్రం వెలవెలబోతోంది. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్‌లో జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది వానకాలం మొదలై రెండు నెలలైనా నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు పూర్తిస్థాయిలో కృష్ణమ్మ చేరలేదు. దీంతో నాగార్జున సాగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సాగర్‌లో నీటి నిల్వలు అడుగంటు తుండడంతో ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సాగర్ ఆయకట్టు సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. తొమ్మిదేళ్ళ తర్వాత నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి గండం ఏర్పడింది.

ఎగువ కృష్ణాపరివాక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా బేసిన్ లోని ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులు మాత్రం జల కళను సంతరించుకున్నాయి. కానీ సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు(215.8070 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 863.40 అడుగులు (116.92టీఎంసీలు)గా మాత్రమే ఉంది. కొద్ది రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్ట్‌ నీటిమట్టం 808 అడుగులు ఉండగా, శ్రీశైలానికి ఎగువ వరద రావడంతో 55.4 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలానికి కూడా ఎగువ నుంచి వరద రాక తగ్గింది. శ్రీశైలం నుంచి వరద నీరు లేక నాగార్జున సాగర్‌ లో నీటి మట్టం క్రమంగా డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటోంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 518.10 అడుగులుగా (147.8335టీఎంసీలు) ఉంది.

సాగర్‌ ప్రాజెక్ట్‌ కనిష్ఠ నీటిమట్టం 510 అడుగులు డెడ్ స్టోరేజ్ మట్టానికి 8అడుగుల దూరంలో ఉంది. వారం రోజులుగా శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తితో రోజూ 20వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేశారు. దీంతో ప 519. అడుగులకు చేరింది. గత ఏడాది ఇదే రోజున సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి 3,83,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరగా, సాగర్‌ నీటిమట్టం 586.60 అడుగులు (300 టీఎంసీలు)గా ఉంది. ఈ ఏడాది కంటే గతేడాది నాగార్జున సాగర్‌ నీటిమట్టం 67.50 అడుగుల (148.3325 టీఎంసీల) నీటి నిల్వ అధికంగా ఉంది.

ANN TOP 10