ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. బైక్ హ్యాండిల్స్‌కు రెండు జాతీయ జెండాలను కట్టుకుని పాత బస్తీలో హల్‌చల్ చేశారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ బైక్‌పై రైడ్ చేశారు. పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్‌పైనే పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన జెండా వందనంలో ఎంపీ పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో గతేడాది మాదిరిగానే చార్మినార్ సమీపంలోని మదీనా సర్కిల్‌లో ఒవైసీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఏడాది ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. శాస్త్రిపురంలోని తన నివాసం నుంచి బైక్‌పై బయలుదేరారు. ఆయనతో పాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు అనుచరులు బైక్‌లపై వచ్చారు. రోడ్లపై బైక్‌లు నడపడం అంటే తనకు ఎంతో ఇష్టమని అసదుద్దీన్ ఒవైసీ గతంలో పలుమార్లు చెప్పారు.









