స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన కీచక అధికారిని సస్పెండ్ చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలమని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదు వచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో అధికారి లైంగిక వేధింపుల ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మంత్రి పేర్కొన్నారు.
కాగా హకింపేట ఓఎస్‌డి (OSD)గా పని చేస్తున్న హరికృష్ణ అనే అధికారిని సస్పెండ్ చేశామని, విచారణ రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. వారికి సహకరించిన వారిని వదలమని చెప్పారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని తాము ఢిల్లీలో కోరామని కానీ జరగలేదన్నారు. హైదరాబాద్‌లో ఉదయం 7 గంటలకు విషయం తెలిస్తే అప్పుడే చర్యలు తీసుకున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.









