గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే కోసం ఖమ్మం జిల్లాలో చేపట్టిన భూ సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. రఘునాథపాలెం మండలంలో నాగపూర్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే సర్వే ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో శనివారం నిర్వాసిత రైతులు సర్వేకు రావాలని రెవెన్యూ అధికారులు సమాచారం అందించారు. మరోవైపు శనివారం ఉదయం ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో 300 మందికిగాపై పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి సర్వేకు రైతులు రాకుండా అడ్డుకున్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ప్రజాపంథా తదితర పార్టీల ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులతోపాటు నిర్వాసిత రైతులు రఘునాథపాలెం వద్ద సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
తమ భూముల నుంచి హైవే వద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ధర్నాకు దిగడంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ రైతు పురుగుమందు తాగేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోనళకు దిగినవారిలో 15 మందిని అరెస్టు చేశారు. రైతుల అరెస్టు, పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైతుల అరెస్టు అనంతరం పోలీసుల పహరాతో ఖమ్మం రూరల్, రఘునాథపాలెం మండలంలోని తీర్థాల, కామంచికల్, మల్లెమడుగు, రేగులచలక, కోయచలక, రఘునాథపాలెం, బల్లేపల్లి, వీవీపాలెంలో 21కి.మీ. పొడవున 266ఎకరాల్లో సర్వే నిర్వహించారు. సర్వే పనులను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు.









