AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీలో షర్మిల.. నేడు రాహుల్, ఖర్గేతో భేటీ

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా ఆమె వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. బెంగుళూరు నుంచి ఢిల్లీ వచ్చిన షర్మిల.. నేడు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటి కానున్నట్టు సమాచారం. పార్టీ విలీనంపై వీరిద్దరితో తొలి దశ చర్చలు నిర్వహిస్తారని తెలుస్తోంది. వీరిద్దరితో భేటి అనంతరం పార్టీ విలీనంపై చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం.కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో చేరేందుకు షర్మిల సిద్ధమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండానే విలీనానికి షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా వార్తలు అయితే వచ్చాయి. ఇప్పటికే కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను ఆమె తీసుకున్నట్టు తెలుస్తోంది. విలీనం అయ్యాక పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

గతంలో వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఇడుపులపాయకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ వస్తున్నారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే అది ముందుకు సాగలేదు. ఎట్టకేలకు ఈ వారంలో షర్మిల పార్టీకి సంబంధించిన విషయంలో కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ వారంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశమున్నట్లు సమాచారం.

ANN TOP 10