పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దయచేసి తమ పిల్లలను రాజకీయాల్లోకి లాగకండి అని విజ్ఞప్తి చేశారు. ఇటీవల బ్రో చిత్రంలో ఒక పాత్ర ద్వారా ఏపీ మంత్రిని విమర్శించారంటూ పవన్ కల్యాణ్ పైనా, చిత్రబృందంపైనా దుమారం రేగడం తెలిసిందే. ఈ పరిణామాలపై రేణూ దేశాయ్ స్పందించారు. గత కొన్నిరోజులుగా తాను విదేశాల్లో ఉన్నానని, తిరిగొచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిశాయని వెల్లడించారు. పవన్ మూడు పెళ్లిళ్లు, నలుగురు పిల్లలపై ఓ చిత్రం తీస్తున్నారన్న వార్తలు కూడా వినిపించాయని తెలిపారు. ఇలాంటివి తనను చాలా బాధిస్తున్నాయని అన్నారు.
“మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా బిడ్డల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు. అభిమానులు, నేతలు, విమర్శకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా… నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగకండి. వ్యక్తిగత అజెండాలు ఉంటే మీరు మీరు చూసుకోండి. పిల్లలకు రాజకీయాలతో ఏంటి సంబంధం? వాళ్లు పవన్ కల్యాణ్ పిల్లలు అయినందునే వారిని ఇలా ఇబ్బందులకు గురిచేస్తారా? ఇటీవలి పరిణామాలతో వాళ్లకు ఏమైనా సంబంధం ఉందా?” అంటూ రేణూ దేశాయ్ స్పందించారు.









