AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్: రేవంత్ రెడ్డి..

డిజిటల్ యుగంలో సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను వెంటనే రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) సౌత్ జోన్ రీజనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఆన్‌లైన్‌లో పిల్లలు ఎక్కువ సమయం గడుపుతున్నారని, అక్కడ ఎదురయ్యే ప్రమాదాలపై వారికి సరైన అవగాహన ఉండటం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థతో సంప్రదింపులు జరిపి ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని సూచించారు. మహిళలు, పిల్లల సంరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా న్యాయ సేవలను రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులకు సీఎం కీలక సూచనలు చేశారు. పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను గమనించేటప్పుడు తీర్పులిచ్చేలా కాకుండా ఆసక్తిగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. “క్యూరియస్‌గా ఉండండి, జడ్జ్‌మెంటల్‌గా కాదు” అని ఆయన హితవు పలికారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 1098 నంబర్లను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే భరోసా సెంటర్లు, దేశంలోనే మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు, సైబర్‌హర్ యాప్ వంటివి సమర్థంగా పనిచేస్తున్నాయని సీఎం గుర్తుచేశారు.

ANN TOP 10