AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైసీపీకి మరో షాక్..! రాజీనామా చేస్తున్నా మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు..

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ ఛైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో వైసీపీ అధిష్ఠానం ఆయన్ను నిన్న సస్పెండ్ చేయగా, ఆ మరుసటి రోజే ఆయన పార్టీని వీడటం గమనార్హం.

విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అప్పలనాయుడు… పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్‌ను ఒక ‘నియంత’గా అభివర్ణించిన ఆయన… వైసీపీ ఒక లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందని ఆరోపించారు. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు ఇకపై కొనసాగలేమని స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు, చంద్రబాబు ఎలాగూ ఓడిపోతారన్న జగన్ అతివిశ్వాసమే పార్టీ ఘోర పరాజయానికి కారణమని విశ్లేషించారు.

పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటుందా? అని ప్రశ్నించిన అప్పలనాయుడు… నేతలు తమ సొంత సంస్థలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను నమ్మి వేలాది కుటుంబాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన బంధువైన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను సస్పెండ్ చేసినప్పుడు, ఆయనకు మరో బంధువైన బొత్స సత్యనారాయణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.

ఇటీవల చిన్న శ్రీను, ఆయన కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు స్థానిక నేతలు, జడ్పీటీసీలు కూడా వైసీపీని వీడారు. చిన్న శ్రీనుకు అత్యంత సన్నిహితుడైన బడ్డుకొండ కూడా ఇప్పుడు పార్టీ నుంచి నిష్క్రమించడంతో, ఒకప్పుడు బొత్స కుటుంబానికి కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లాలో వైసీపీ బలం గణనీయంగా క్షీణిస్తోందన్న చర్చ జరుగుతోంది.

ANN TOP 10