కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావుకు ఊరటనిస్తూ.. హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటుపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై వనమా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వనమా పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. వనమాకు ఊరటనిస్తూ.. హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటుపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
తప్పుడు సమాచారం ఇచ్చారని..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజవర్గం నుంచి వనమా వెంకటేశ్వరావు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి (ఇప్పుడు బీఆర్ఎస్) జలగం వెంకట్రావు పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వనమాకు 81,118 ఓట్లు రాగా.. వెంకట్రావుకు 76,979 ఓట్లు వచ్చాయి. కేవలం 4,139 ఓట్ల తేడాతో జలగం ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వనమా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఇద్దరు నేతలూ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే తన ఆస్తులను దాచి వనమా ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని జలం వెంకట్రావు 2019లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆయన ఎన్నిక చెల్లదని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వనమా ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. 84 పేజీలతో కూడిన తీర్పును ఇచ్చింది. వనమా ఎన్నికను రద్దు చేస్తూ.. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా న్యాయస్థానం గుర్తించింది. 2018 డిసెంబర్ 12 నుంచి జలంగను ఎమ్మెల్యేగా గుర్తించింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను వనమాకు రూ. 5 లక్షలు ఫైన్ కూడా విధించింది. ఆ తర్వాత వనమా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.









