AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చేయిచేయి కలుపుదాం.. అవినీతి పాలనను తరిమికొడదాం

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ రాజారమేశ్‌
కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు

చేయి చేయి కలుపుదాం రాష్ట్రంలో అవినీతి పాలనను తరిమికొడదామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, చెన్నూరు నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్‌ రాజా రమేశ్‌ అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. భీమారం మండలం మద్దికల్‌ గ్రామంలో దాదాపు 100 మందికి పైగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. యువకులకు డాక్టర్‌ రాజా రమేశ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజా రమేశ్‌ మాట్లాడుతూ సంక్షేమ పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు.

పార్టీలో చేరిన యువ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అడ్డుకట్ట వేసి ప్రజలకు స్వేచ్ఛ జీవితం గడపాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుందనే నమ్మకంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరామన్నారు. రానున్న ఎన్నికల్లో చెన్నూర్‌ గడ్డ మీద బాల్క సుమన్‌ ను ఓడించి తప్పకుండా కాంగ్రెస్‌ పార్టీనీ గెలిపిస్తామని యువకులు డాక్టర్‌ రాజా రమేశ్‌కు హామీ ఇచ్చారు.

అలాగే మడ్డికల్‌ గ్రామంలోని లక్ష్మీదేవి ఆలయం, భక్త ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని గుడి ప్రాంగణాన్ని పరిశీలించి గుడికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. దేవాలయాల్లో మాత్రమే కాకుండా గ్రామం లో ఎక్కడ చూసినా తాగునీటి వసతులు ఇబ్బంది కరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూర్‌ గడ్డ మీద కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత గుడి అభివృద్ధి చర్యలు చేపడతానని గ్రామ పెద్దల ముందు అమ్మవారి సాక్షిగా మాట ఇచ్చారు. కార్యక్రమంలో భీమారం మండల పెద్దలు, మద్ధికల్‌ గ్రామ కార్యకర్తలు నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10