తెలుగు చలన చిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి (TFCC) ఎన్నికలు ఆదివారం (జులై, 30) ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నాం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ర్టిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టార్‌ల మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందిద్దామనే కాంక్షతో దిల్ రాజు ప్యానల్, చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జీ తగ్గింపు హామీలతో సి.కల్యాణ్ ప్యానెల్ బరిలో నిలిచాయి. అధ్యక్ష పదవి కోసం సీనియర్ నిర్మాత సి.కల్యాణ్, దిల్ రాజు పోటీపడుతున్నారు. అన్ని సెక్టార్లు కలిపి మొత్తం 2 వేలకు పైగా ఇందులో సభ్యులున్నారు. నిర్మాతల సెక్టార్ నుంచి సుమారు 1500 మంది, డిస్ర్టిబ్యూటర్ల నుంచి 500, స్టూడియో? నుంచి 98 మంది సభ్యులుగా ఉన్నారు. ఒక్కొక్కరుగా వచ్చిన ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
నేటి ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి, నిర్మాత సుప్రియ, గుణశేఖర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు మొత్తం 104 ఓట్లు పోలైయ్యాయి. 11.30 నిమిషాల సమయానికి 710 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 450, స్టూడియో సెక్టార్ నుంచి 50, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 210 పోలైన ఓట్లు అయ్యాయని తెలిసింది. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి 16 మంది ఈసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 గంటలకు పోలింగ్ పూర్తవుతుంది. వెంటనే లెక్కింపు మొదలుపెట్టి 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. వీరిద్దరిలో గెలుపెవరితో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే!









