నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్‌రెడ్డి భార్య లహరి రెడ్డి మృతి కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. భార్య లహరిని హత్య చేసిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. కేసు విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. లహరి మృతిని వల్లభ్‌రెడ్డి గుండెపోటుగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. లహరి రెడ్డి తలను గోడకు, తలుపుకు గట్టిగా బాది పొట్టలో కాలుతో బలంగా తన్నడంతోనే ఆమె మృతి చెదినట్లు పోలీసులు వెల్లడించారు. లహరి పొట్టలో కాలుతో తన్నడంతో పొట్టలో రెండున్నర లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ జరిగిందన్నారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా హార్ట్ ఎటాక్ పేరుతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నారాయణగూడ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు.
“ఈనెల 14న మాకు అపోలో ఆసుపత్రి నుంచి కాల్ వచ్చింది. మేం ఆసుపత్రికి వెళ్లాం. లహరీ నుదిటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. అలాగే ఆమె పెదాలపై కూడా గాయాలు కనిపించాయి. గతంలో ఆమెకు ఎలాంటి మెడికల్ హిస్టరీ లేదు. మ్యారేజ్ అయ్యి కేవలం ఏడాది మాత్రమే అయింది. దీంతో మేం అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసాం. ఆ తర్వాత పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శరీరంలోపల గాయాలైనట్లు తేలింది. 2.5 లీటర్ల బ్లడ్ క్లాట్ అయినట్లు రిపోర్టు వచ్చింది. ఈ మేరకు కేసులు నమోదు చేశాం.
ఆ ఘటన జరిగినప్పుడు భర్త మాత్రమే ఉన్నాడు. ఈ మేరకు 26న వల్లభ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నాం. విచారణలో మరికొన్ని విషయాలు తెలిశాయి. భార్యభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లో ఆమె జుట్టుపట్టుకొని డోర్ కు కొట్టాడు. ఆ తర్వాత ఆమెను పొత్తి కడుపులో తన్నాడు. ఆ తర్వాత హార్ట్ ఎటాక్ అని ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ మేరకు అతడిపై సెక్షన్ 302 మర్డర్, 201 సాక్షాల తారుమారు కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాం.” అని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ శ్రీనివాస్ వెల్లడించారు.









