– ఏమాయె నాటి గాంభీర్యం..
– మూగనోము పట్టిన గొంతు
– అన్ని పార్టీలను ఏకం చేస్తాం.. మోదీని గద్దె దించుతాం అని చెప్పిన గులాబీ బాస్
– నేడు ఉలుకని పలకని నేత
– మౌనం వ్యూహాత్మకమా?
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పాలిటిక్స్’ అంతుచిక్కని వ్యవహారంగా మారింది. మొన్నటి వరకు భారత దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, భారత దేశాన్ని ఏలుతామని చెప్పిన నేత ప్రస్తుతం మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది రాజకీయ పరిశీలకులకు, ప్రత్యర్థి పార్టీలకు అంతుచిక్కడంలేదు. సుమారు రెండు నెలలుగా ఉలుకూ పలుకూ లేకుండా.. మౌనం పాటిస్తున్నారు. కేవలం మహారాష్ట్రలోనే పార్టీ కార్యక్రమాలను అప్పుడప్పుడు కొనసాగిస్తున్నారు.
తమిళనాడు, బిహార్, యూపీ వంటి రాష్ట్రాలకు వెళ్లి.. అక్కడి ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపి.. వారితో చేతులు కలిపి.. ప్రెస్‌మీట్లు కూడా పెట్టారు. దీంతో దేశంలో ఏదో మార్పు ఖాయమని.. దీనికి కేసీఆర్‌తోనే శ్రీకారం చుడుతున్నారనే సంకేతాలు కూడా పంపించారు. అంతేకాదు.. ప్రధాని మోదీపై ఒంటికాలిపై లేచారు. దేశ జీడీపీ నుంచి చైనా ఆగడాల వరకు.. అభివృద్ధి నుంచి అప్పుల వరకు ఆయన అనేక సందర్భాల్లో మోదీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు సైతం చేశారు.
ఇప్పుడు దేశంలో ఎక్కడా కేసీఆర్ మాట వినిపించడం లేదు. పైగా.. కేవలం ఒకే వైపు చూస్తున్నట్టు ఆయన చూపంతా మహారాష్ట్రవైపు ఉందని బీఆర్‌ఎస్ వర్గాలే చెబుతున్నాయి. మణిపూర్ వంటి చిన్న రాష్ట్రం తగలబడిపోయిందని, గిరిజనులపై దారుణ మారణాలు జరుగుతున్నాయని దేశం మొత్తం గగ్గోలు పెడుతున్నా.. కేసీఆర్ స్పందించడంలేదు.
దీంతో అన్ని పార్టీలను ఏకం చేసే ఆయన ప్రయత్నం ఆగిపోయినట్టేనా? ఆయనతో కలిసి వచ్చే పార్టీలు లేవా? లేక ఆయనే కలవడం లేదా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు చెబుతున్నట్లు బీజేపీ పంచాన చేరారా? అన్నది సందేహస్పదంగా మారింది.
మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీలో కీలక నేతలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తుండటం… ఇప్పటికే చాలా మంది నేతలు హస్తం గూటికి చేరడంతో ‘గులాబీ ఇల్లు’ను చక్కదిద్దే పనిలో పడ్డారా? అన్న విషయంపైనా రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతోంది.









