నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన బీటెక్ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్ చివరికి విషాదాంతంగా మారింది. ఈనెల 17న సంగారెడ్డి జిల్లాలోని కంది ఐఐటీ హైదరాబాద్ హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన కార్తీక్.. సోమవారం రాత్రి వైజాగ్ బీచ్‌లో శవమై కనిపించాడు. బీచ్‌లో శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఐఐటీ విద్యార్థి కార్తీక్ మృతదేహాంగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని విశాఖలోని జీజీహెచ్‌కు తరలించారు.
దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కార్తీక్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆరీలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో బీచ్‌లో దూకి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేనంతగా డెడ్ బాడీ మారిపోయింది. కార్తీక్ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటనేది తెలసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కార్తీక్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం కార్తీక్ చదువుతున్నాడు. అతడి స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలోని ట్యాంక్ తండా కాగా.. బీటెక్ సెకండ్ ఇయర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు చెబుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.









