కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాజంపేట మండలం మూడుమామిళ్ల తండాలో పాము కాటుతో తండ్రీకొడుకు మృతి చెందాడు. రాత్రి నిద్రలోనే పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన ముద్రించ రవి (40), కొడుకు వినోద్ (12) రాత్రి భోజనం చేసి ఇంట్లోనే పడుకున్నారు. అర్ధరాత్రి దాటికి తర్వాత వారు గాఢనిద్రలోకి జారుకున్నాక ఇంట్లోకి విషపూరిత పాము దూరింది.
నిద్రిస్తున్న రవి, వినోద్‌లను పాము కాటేసింది. పాము కాటు వేయగానే తండ్రి రవికి మెలుకవ వచ్చింది. ఏదో కరిచినట్లుగా అనిపించటంతో రవి లైట్ ఆన్ చేసి చూడగా.. పాము కనిపించింది. వెంటనే దాన్ని చంపేశారు. ఆ తర్వాత కుటుంబసభ్యులు తండ్రీకొడుకులను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండాలో విషాదం అలుముకుంది.









