AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీలో వేదికనెక్కిన విభేదాలు

– దుమారం రేపుతున్న బండి సంజయ్‌ వ్యాఖ్యలు
– కిషన్‌రెడ్డి కార్యక్రమానికి దూరంగా ఉన్న కీలక నేతలు
– విజయశాంతి అలక..
– కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భావోద్వేగం
రాష్ట్ర బీజేపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.. ఈసారీ ఏకంగా వేదికెక్కాయి. అంతేకాదు సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి సమక్షంలోనే జరగడం గమనార్హం. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయడం ఆపండని.. కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని రాష్ట్ర కొందరి నేతలపై పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వేదికపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అలాగే పార్టీలో కీలక నాయకురాలు విజయశాంతి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. మీడియాలో ఈ విషయం వైరల్‌ కావడంతో ఆమె ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కిషన్‌ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో నాడు ప్రత్యేక తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వారు వేదికపై ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులు అక్కడ ఉండడంతో తాను అసౌకర్యంగా ఫీల్‌ అయ్యాయని విజయశాంతి తెలిపారు.

అలాంటి వేదికపై చివరివరకు ఉండడం అసాధ్యమని, అందుకే మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆమె స్పష్టత ఇచ్చారు. మాజీ సీఎం నల్లారి కి రణ్‌ కుమార్‌ రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ఈ వ్యాఖ్య లు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అనంతరం జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీకి ఈ స్థాయిలో జోష్‌ వచ్చిందంటే అందుకు బండి సంజయ్‌ కారణమని వేదికపై భావోద్వేగంగా ప్రసంగించారు. ‘బండి సంజయ్‌ను చూసి కళ్లలో నీళ్లు తిరిగితే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చి వచ్చాను. కేసీఆర్‌కి వ్యతిరేకంగా బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. బండి సంజయ్‌ను పార్టీ గుండెల్లో పెట్టుకోవాలి’ అని కోరారు.

మరోవైపు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కిషన్‌ రెడ్డి బాధ్యతల స్వీకారానికి మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి దూరంగా ఉన్నారు. వీరంతా పార్టీ అధిష్టానం తీరుపై కొంతకాలంగా అసంతృప్తతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు పార్టీలో కొనసాగే విషయంపైనా తర్జనభర్జన పడుతున్నారని, త్వరలోనే కండువా మార్చబోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.

కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం హాజరు కాకపోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. సమయంలో పలువురు అసంతృప్త నేతలు కిషన్‌ రెడ్డి కార్యక్రమానికి తరలివచ్చారు. ఈటల రాజేందర్, రఘునందన్‌ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, విజయ శాంతి, వివేక్‌ వెంకటస్వామి, యెన్నం శ్రీనివాస్‌ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు.

ANN TOP 10