ప్రముఖ విద్యావేత్త, శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (BS Rao) కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం (జూలై 13) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆయన భౌతికకాయాన్ని విజయవాడ తరలించనున్నారు. విజయవాడలో రేపు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్ రావు తన నివాసంలో బాత్రూంలో జారిపడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచారు.
విజయవాడలో గర్ల్స్ కాలేజీ స్థాపించి.. అంచెలంచెలుగా..
ఉన్నత విద్యాభ్యాసం చేసిన డాక్టర్ బీఎస్ రావు తొలుత ఇంగ్లాండ్, ఇరాన్‌లో వైద్యుడిగా సేవలు అందించారు. 1986లో విజయవాడలో ‘శ్రీచైతన్య బాలికల జూనియర్ కాలేజీ’ని ప్రారంభించారు. ఆయన వేసిన ఈ అడుగు ఆ తర్వాత కాలంలో విద్యా రంగంలో పెను మార్పులకు కారణమైంది. అనతి కాలంలోనే మంచి గుర్తింపు రావడంతో విద్యాసంస్థలను అంచెలంచెలుగా విస్తరించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నింట్లో తమ సంస్థలను ప్రారంభించారు.









