ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటూ ప్రతిపక్షాలే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు, రాజకీయ విశ్లేషకులను భయభ్రాంతులకు గురిచేసేందుకే అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు.
వివాదాస్పద యూట్యూబర్ రావణ్ (జోసెఫ్), కేవీఆర్ వంటి వారికి తమ వైసీపీతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని అంబటి స్పష్టం చేశారు. అయినప్పటికీ ఒక సాధారణ యూట్యూబర్‌పై దేశద్రోహం, ‘ఉపా’ వంటి కఠిన చట్టాలను ప్రయోగించడం ప్రభుత్వ దురహంకారానికి నిదర్శనమన్నారు. చట్ట పరిధి దాటి ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవచ్చు కానీ, దారుణమైన సెక్షన్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
రావణ్‌ను శారీరకంగా అంతమొందించే ప్రయత్నాలు కూడా జరిగాయని అంబటి సంచలన ఆరోపణ చేశారు. ఈ కేసులో పిఠాపురం కోర్టుతో పాటు పలు న్యాయస్థానాలు రావణ్‌కు అనుకూలంగా తీర్పులు ఇచ్చినా ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోవడం లేదన్నారు. రావణ్ తమ పార్టీ వ్యక్తి కాకపోయినప్పటికీ, బాధితుడిగా అతనికి వైసీపీ తరఫున అవసరమైన పూర్తి న్యాయ సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు.
కేవీఆర్ అరెస్టు వ్యవహారంలో ఏపీ పోలీసులు కనీస చట్టపరమైన నిబంధనలు పాటించలేదని… అందుకే దౌర్జన్యంగా ప్రవర్తించిన ఏపీ పోలీసులపై ఏకంగా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై అధికారిక దౌర్జన్యకాండ సాగుతోందని అంబటి విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొందరు వ్యక్తులు అత్యంత అసభ్య పదజాలంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా… వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, చట్టం అందరికీ ఒకేలా ఎందుకు వర్తించడం లేదని నిలదీశారు.








