అమెరికా కీలక ప్రకటన
సముద్రం అడుగున 3800 మీటర్ల లోతులో శకలాల గుర్తింపు.
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు గల్లంతైన టైటాన్ (Titan Submarine) మినీ జలాంతర్గామి కథ విషాదం ముగిసింది. పీడనం తీవ్రత పెరగడం వల్ల సబ్-మెరైన్ పేలిపోయి అందులోని ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్ తాజాగా ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించినట్టు పేర్కొంది. టైటానిక్ నౌక సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. తక్షణమే బాధిత కుటుంబాలకు దీని గురించి సమాచారం ఇచ్చినట్టు యూఎస్ కోస్ట్‌గార్డ్ రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు.
యూఎస్ కోస్ట్ గార్డ్, రెస్య్కూ సిబ్బంది తరఫున మృతులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు, టైటానిక్ మినీ-సబ్‌మెరైన్‌లోని ఐదుగురు పర్యాటకులు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నామని ఓషన్‌గేట్ సంస్థ వెల్లడించింది. ‘‘ఈ ఐదుగురు వ్యక్తులు నిజమైన అన్వేషకులు. ప్రపంచ మహాసముద్రాల అన్వేషణ, రక్షణలో వీరికి ఎంతో అభిరుచి ఉంది.. ప్రస్తుత ఈ విషాద సమయంలో వీరి కుటుంబాల గురించే మా ఆలోచన.. ఈ ఘటనకు చింతిస్తున్నాం’’ అని ఓషన్ గేట్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో గత ఆదివారం న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి ఈ సబ్-మెరైన్ బయలుదేరింది. ఇందులో పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ (58), ఫ్రెంచ్ నేవీ మాజీ అధికారి పాల్ హెన్రీ (77), ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ (61)లు ప్రయాణించారు. బయలుదేరిన కొద్ది గంటల్లోనే సబ్-మెరైన్‌తో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయి.
దీంతో గల్లంతైన సబ్-మెరైన్ ఆచూకీని గుర్తించడానికి కెనడా, అమెరికా కోస్ట్‌గార్డ్ దళాలు రంగంలోకి దిగి మూడు రోజుల పాటు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఇందులో 30 గంటలకు సరిపడే ఆక్సిజన్ నింపగా.. అత్యవసర పరిస్థితుల్లో 96 గంటలకు సరిపడేలా ఏర్పాట్లు ఉండడంతో సమయం గడిచే కొద్దీ ఉత్కంఠగా మారింది. భారత కాలమాన ప్రకారం గురువారం సాయంత్రం 7.00 గంటల వరకు ఆక్సిజన్ సరిపోతుందని నిపుణులు అంచనా వేశారు. మంగళవారం నుంచి టైటాన్ తప్పిపోయిన ప్రాంతంలో కొన్ని శబ్దాలు వినిపించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ తెలిపింది. దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడ గాలించినా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అయితే ఆ శబ్దాలు టైటానిక్‌కు సంబంధించినవి కావని తర్వాత పేర్కొంది.









