రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో అందించాల్సిన సహాయంపై కేంద్ర మంత్రులను కలువనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం కోరుతున్నది. అయినా అనేక అంశాలపై బీజేపీ ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను బలంగా వినిపించనున్నారు.









